నెల్లూరు, ఉద్యమ వార్త; మే 13.
రాష్ట్రంలో ఆక్వా రైతులను నిలువునా దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో చేతులు కలిపిందని వైయస్సార్సీపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఆక్వా ఫీడ్ ధరల పెంపు వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని ఎండగట్టారు.అప్సడా (APSADA) చట్టాన్ని తుంగలో తొక్కి,ఎన్నడూ లేని విధంగా టన్నుకు రూ.10 వేల వరకు ఫీడ్ ధరలు పెంచి రైతు నడ్డి విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఒకవైపు రొయ్యల ధరలు పడిపోతుంటే,మరోవైపు ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతుల కష్టాన్ని టీడీపీ నేతల ‘ముడుపుల’ పాలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, చంద్రబాబునాయుడికి మొదటి నుంచీ రైతులన్నా, వ్యవసాయమన్నా అశ్రద్ధేనని ఆయన ధ్వజమెత్తారు.
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ.8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 – 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం,ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.ఫీడ్ తయారీదారులు అధిక శాతం తెలుగుదేశం పార్టీకి చెందిన వారు లేదా సానుభూతిపరులే కావడంతో,అందరూ సిండికేట్‌గా ఏర్పడి రైతుల నడ్డి విరుస్తున్నారని 2024 ఎన్నికలకు ముందు ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడా లేకుండా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ యూనిట్ రూ.1.50 కే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మాట తప్పారని ఆయన తెలిపారు.రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేర్చకపోగా, ఇప్పుడు ఫీడ్ ధరల పెంపుతో రైతులకు పిడుగుపాటు కలిగించారని.ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం అని ఆయన తెలిపారు.
వైయస్.జగన్ హయాంలో మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాలని చూస్తే, ఆయన అధికారులను, మంత్రులను అప్రమత్తం చేసి ధరలు పెరగకుండా రైతుల పక్షాన నిలబడ్డారు.కానీ కూటమి పాలనలో ముడిసరుకులపై దిగుమతి సుంకాలు 30% నుంచి 15%కి తగ్గినా,ఆ ప్రయోజనాన్ని రైతులకు చేరనీయకుండా కంపెనీలు ముడుపుల రూపంలో ప్రభుత్వంలోని వ్యక్తులకు ఇస్తున్నాయి ఆక్వా రైతుల కష్టం మొత్తం ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపుల రూపంలో చేరుతోంది.దళారులు, ట్రేడర్ల కంటే ఇప్పుడు ప్రభుత్వమే పెద్ద దళారీగా మారి దోపిడీ చేస్తోంది.అందుకే రైతులు రోడ్డెక్కి ఫీడ్ బస్తాలను తగులబెట్టి నిరసన తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను,తక్షణమే రద్దు చేయాలి.అప్సడా చట్టాన్ని అతిక్రమించి ఏకపక్షంగా రేట్లు పెంచిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.




