వాకాడు,ఉద్యమ వార్త; ఏప్రిల్ 9.
పరిశ్రమల స్థాపన మరియు అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే అదే క్రమంలో తరతరాలుగా సముద్రంపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయకూడదని తూపిలిపాలెం గ్రామ పెద్దకాపు, మాజీ సర్పంచ్ ఆర్కేటి మహేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జెమిని కొత్తపాలెంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన, పోర్టు నిర్మాణం కారణంగా మత్స్యకారులు ఎదుర్కోబోయే సవాళ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత పదేళ్ల అనుభవాలను గుర్తు చేస్తూ, గతంలో ప్రైవేటు హ్యాచరీల రాకతో సముద్రపు ఉప్పు నీటి ప్రభావం వల్ల గ్రామంలోని జామాయిల్, సవక తోటలు ఎండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో గ్రామ పెద్దలు హ్యాచరీల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఏడాదికి సుమారు 15 నుండి 20 లక్షల రూపాయల నిధులను గ్రామానికి అందేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ నిధులతో దేవాలయాల అభివృద్ధి మరియు వెనుకబడిన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి తూపిలిపాలెంను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిర్మించతలపెట్టిన పోర్టు వల్ల దాదాపు 5 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో హార్బర్ నిర్మాణం జరగనుందని, దీనివల్ల 14 గ్రామాలకు చెందిన మత్స్యకారుల వేటకి తీవ్ర ఆటంకం కలుగుతుందని మహేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు. పోర్టు నిర్మాణ ప్రాంతం గుండా సముద్రంలోకి వెళ్లేందుకు మత్స్యకారులకు ప్రత్యేక ‘పాస్’ సౌకర్యం కల్పించాలని, అలాగే వేట సాగించే ప్రాంతాన్ని కోల్పోవడం వల్ల నష్టపోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి భరోసా కల్పించాలని కోరారు. పరిశ్రమల అభివృద్ధికి తాము సహకరిస్తామని, అయితే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం గ్రామ పెద్దలతో కలిసి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ, తూపిలిపాలెం గ్రామస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జడ్పీటీసీ రైతు రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు వెంకటకృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, ఆర్‌ఐ అఖిల్ యాదవ్, మండల సర్వేయర్ గోపిరెడ్డి మరియు రెవెన్యూ సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.